రాముడు లేదా రామ చరిత్ర లేకుండా ఈ దేశాన్ని ఊహించలేమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ప్రతి మతం, ప్రతి భాషలోనూ రామాయణం ఉందని తెలిపారు. షేక్ సదుల్లా మాష్‌కు చెందిన రామయన్ యే మాషి కూడా ఉందని చెప్పారు. జనవరి 22వ తేదీ భవిష్యత్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అమిత్ షా వెల్లడించారు.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట అంశంపై లోక్ సభలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ….. ‘ఆగస్టు 5న అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత దేశంలో అల్లర్లు జరుగుతాయని అందరూ టెన్షన్ పడ్డారు…. ఆలయం నిర్మాణ సమయంలోనూ అంతా అదే విషయంపై ఆలోచించారు’అని చెప్పారు.
‘కానీ మోడీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆగస్టు 5న ఇచ్చిన తీర్పును మనమంతా గౌరవించాలి. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం హిందూ సమాజం చాలా ఏండ్లు కష్టపడింది. ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోడీ 11 రోజుల పాటు ఉపవాసం పాటించారు. విష్ణు సంప్రదాయం ప్రకారమే అయోధ్య ప్రతిష్టలో ప్రధాని మోడీ పాల్గొన్నార’అని వివరించారు.
‘ఆ సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారని….. విభిన్న భాషల్లో ఆయన రామభజన చేశారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమాన్ని ప్రధాని మోడీ నడిపించారు. సుమారు 330 ఏండ్ల న్యాయ పోరాటం తర్వాత రామ్‌లల్లా చివరకు తన నివాస స్థానానికి చేరారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయలేదు’అని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ…. ‘బాబ్రీ మసీదు జిందాబాద్.. జిందాబాద్.. భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతను పార్లమెంట్ ఖండించింది. ఆ ఘటన నేపథ్యంలో వీహెచ్‌పీ లాంటి సంస్థలు వర్గ హింసకు పాల్పడ్డాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారణమైన ఇద్దరు వ్యక్తులకు కేంద్ర సర్కార్ భారత రత్న అవార్డులు ఇచ్చింది’అని ఓవైసీ ఆరోపించారు.
ప్రధాని మోడీని ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నానని, మోడీ ప్రభుత్వం కేవలం హిందువులకేనా లేదా యావత్ దేశానికా అని ఓవైసీ ప్రశ్నించారు. ఇస్లామిక్ కట్టడాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించిందన్నారు. సుప్రీం తన తీర్పులో అర్కియాలజీ సర్వే శాఖ ఇచ్చిన రిపోర్టును కొట్టివేసిందని పేర్కొన్నారు. మసీదును నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చలేదని ఓవైసీ అన్నారు.