Telugu News » KTR : బడ్జెట్ నిరాశ పరిచింది…. ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే యుద్దమే…!

KTR : బడ్జెట్ నిరాశ పరిచింది…. ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే యుద్దమే…!

ఈ బడ్జెట్‌ చాలా నిరాశ జనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శలు గుప్పించారు.

by Ramu
brs working president ktr criticised cm revanth reddy in sanath nagar

తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ (BRS)నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ బడ్జెట్‌ చాలా నిరాశ జనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి బుడ్డరఖాన్ లాగా మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

brs working president ktr criticised cm revanth reddy in sanath nagar

సికింద్రాబాద్‌లో సనత్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ…. రాష్ట్రంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు చేసేందుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. కానీ బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.53 వేల కోట్ల మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని ఫైర్ అయ్యారు.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి కరెంటు మీటర్‌కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు.

మరో వైపు రాష్ట్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వాగ్ధానాలుగానే మిగిలిపోయాయని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రకటించిన హామీలపై ప్రజలకు నమ్మకం కలిగించలేదని ఫైర్ అయ్యారు. అంకెలను మార్చి ఆంక్షలు పెట్టే విధంగా బడ్జెట్ ఉందన్నారు.

ప్రజాపాలన అభాసుపాలు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్‌ను ప్రతిరోజూ నిర్వహిస్తామని కాంగ్రెస్ మెనిఫెస్టోలో చెప్పారని.. కానీ అలా జరగడం లేదని చెప్పారు. అన్నదాతలను ఆగం చేసే విధంగా బడ్జెట్ ఉందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ. 19 వేల కోట్ల నిధులతో రైతు భరోసా ఎలా అమలు చేస్తారు ? అని నిలదీశారు.

రైతు భరోసాకు రూ.22 వేల కోట్ల రూపాయలు అవసరమన్నారు. రైతు బీమాకు కేటాయింపులు ఎక్కడ ? అని ప్రశ్నించారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన మాటలు బోగస్‌గా మారాయని నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీ‌కు బడ్జెట్‌లో మొండి చేయి చూపారని తీవ్ర అసంతృప్తి వ్యక్త పరిచారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు.

బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని తీవ్రంగా విరుచుకపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇవ్వాల్సి ఉన్నా.. వాటికి నిధుల కేటాయింపుపై ప్రస్తావనే లేదన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరాను ఎక్కడ ఇస్తున్నారో చూద్దాం పదండని సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామని చెప్పారని.. అసెంబ్లీ రెండు సమావేశాలు అయిపోతున్నాయని…. ఎక్కడ చట్టం. ? చేశారని నిలదీశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు.

You may also like

Leave a Comment