బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BSP State Chief RS Praveen Kumar) అరెస్టయ్యారు. జన్వాడలో మంగళవారం రాత్రి దాడికి గురైన దళితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఇవాళ(బుధవారం) పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ప్రవీణ్ కుమార్ జన్వాడ వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేయడంపై బీఎస్పీ శ్రేణులు మండిపడ్డారు. నిందితులను అరెస్ట్ చేయకుండా మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయడమేంటని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రవీణ్ కుమార్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. దళితులపై డాడి చేసిన మూకలను 18 గంటలు గడిచిన పట్టుకోకుండాతమను అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో దళితులకు రక్షణ లేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.
కేసీఆర్ రాచరిక పాలనను అంతమొందించి అధికారమిస్తే కాంగ్రెస్ సర్కార్ అలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, ఆర్ఎస్ఎస్తో మిలాఖత్ అయ్యి దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా మీ గ్యారంటీల పాలన..? అంటూ ప్రశ్నించారు.