బ్యారేజీలు కూలుతుంటే డ్రామాలు చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఆమె రాజ్యసభకు పోటీ చేసేందుకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖమ్మం ఎంపీ స్థానం ఆశించిన రేణుకా చౌదరికి తెలంగాణలో బెర్త్ కన్ఫామ్ అయింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana) రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అధిష్టానం తనపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నాకు వ్యక్తిగతంగా గుర్తింపు ఇవ్వడమే కాదు.. ఖమ్మంలో కాంగ్రెస్ జెండాను వదలకుండా పనిచేసిన ప్రతీ కార్యకర్తకు ఇచ్చిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు.
ఖమ్మం బరిలోకి చాలామంది ఆశావహులు ఉన్నారని, అధిష్టానం తన అభిప్రాయం అడగలేదని అన్నారు. ఇక రాష్ట్రంలో పదేళ్లు పరిపాలించి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో తమపై విరుచుకుపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పూర్ లూసర్ అని మండిపడ్డారు. ప్రజల సొమ్ము గురించి మాట్లాడుతున్నా, బ్యారేజ్‌లు కూలుతున్నా డ్రామాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పెద్దలసభలో అడుగుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రస్తుతం చాలా ఇబ్బందికర వాతావరణం ఉందన్న ఆమె స్టాండర్డ్స్ మారిపోయాయని తెలిపారు. అవన్నీ ఇప్పుడు మారబోతున్నయని అనుకుంటున్నామన్నారు. సభలో సభ్యులను, మహిళలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇక ఆ పప్పులుడకవని అన్నారు.