ప్రస్తుతం టెక్ రంగంలో ఉద్యోగాలు నీటి మీది బుడగలా మారిపోయాయని తెలుస్తోంది. లక్షల్లో జీతాలు అందుకొన్న వారు సడెన్ గా ఉద్యోగాలు పోతుండటంతో ఆందోళనపడుతున్నారు.. ఇప్పటికే పలు అంతర్జాతీ దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టగా, తాజాగా ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ (Sports Wear) తయారీ సంస్థ నైకీ (Nike) సైతం ఉద్యోగులకు షాకిచ్చింది.
ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో (Employees) 2 శాతం తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. అంటే సుమారు 1,600 కంటే ఎక్కువ మందిని తొలగించ వలసి వస్తోందని కంపెనీ పేర్కొంది. ఈ లేఆఫ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాల్లో పని చేస్తున్న వారు ప్రభావితం అవనున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. ఖర్చులను తగ్గించడంతో పాటు ఇటీవల ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియను రెండు దశల్లో అమలు చేస్తామని తెలిపిన సంస్థ.. మొదటిదశ శుక్రవారం నుంచే మొదలవుతుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆఖరులో రెండో దశ తొలగింపులు ఉంటాయని పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం నైకీలో 83,500 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఈ క్రమంలో కార్యకలాపాల నిర్వహణకు, వృద్ధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని కంపెనీ వివరించింది.
మరోవైపు డిసెంబర్ నాటి ప్రకటనలో నైకీ కొత్త ఉత్పత్తుల సరఫరాను పరిమితం చేయడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, ఆటోమేషన్ పెంపు వంటి చర్యల ద్వారా వచ్చే 2-3 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులను ఆదా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదీగాక సంస్థ అమ్మకాలు మరికొంత కాలం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది.