ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను చేసిన ఇస్రో శనివారం మరో ప్రయోగాన్ని చేపట్టింది. సాయంత్రం 5.35గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 14(GSLV-F14) రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్(ISRO Chairman Somanath) ఈ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో మరో నాలుగు రాకెట్లను నింగిలోకి పంపనున్నట్లు వెల్లడించారు. ఇవాళ GSLV F14 ద్వారా INSAT-3DS ఉపగ్రహన్ని ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ సాఫీగా సాగుతోందని తెలిపారు.
ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న సమాచార ఉపగ్రహాల్లో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో అత్యధిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహాలను పంపిస్తున్నామని వెల్లడించారు. ఈ ఉపగ్రహం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ పరిస్థితులు, తుఫాన్ లాంటి విపత్తులు, వర్షాభావ పరిస్థితులు, మేఘాల గమనాలు, సముద్ర ఉపరితల మార్పులపై స్పష్టమైన సమాచారం అందజేస్తుందన్నారు.
ఈ ఉపగ్రహం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తుందని తెలిపారు. ఇలాంటి కమ్యూనికేషన్ సాటిలైట్లు రాబోయే కాలంలో మరిన్ని ప్రయోగిస్తామన్నారు. ఇక, GSLV F15 ద్వారా ISSAR ఉపగ్రహ ప్రయోగం జూన్‌లో ఉంటుందని సోమనాథ్ ప్రకటించారు.