Modi : ఢిల్లీలో త్వరలో జీ 20 సమ్మిట్ జరగనున్న దృష్ట్యా.. ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, ఇందుకు తనను క్షమించాలని ప్రధాని మోడీ (Modi) కోరారు. ఈ ఈవెంట్ కు సంబంధించి జరిపే ఏర్పాట్ల కారణంగా మీకు ఇబ్బందులు కలగవచ్చు.. అందుకు నన్ను క్షమించాలని ముందుగానే కోరుతున్నా అన్నారు. న్యూఢిల్లీ పాలం విమానాశ్రయంలో నిన్న ఢిల్లీవాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు వస్తున్నారని, వారి పట్ల గౌరవసూచకంగా మనం మెలగవలసి ఉందని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాట్లు భారీ స్థాయిలో ఉంటున్న కారణంగా ప్రజల రాకపోకలకు అంతరాయం లేదా కొన్ని సమస్యలు ఏర్పడవచ్చునన్నారు. మీరు మన దేశ ప్రతిష్ఠను కాపాడతారని ఆశిస్తున్నా అని చెప్పారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో హస్తినలోని ప్రగతి మైదాన్ లో జీ 20 శిఖరాగ్ర సదస్సును నిర్వహించనున్నారు.
వసుధైక కుటుంబం అన్నదే ఈ సమ్మిట్ థీమ్ అని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన అన్నారు. ఈ తేదీల్లో కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయవలసి రావచ్చు.. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ ను, సుప్రీంకోర్టును మూసివేయనున్నారు. .
సెప్టెంబరు 8 నుంచి 10 తేదీల వరకు బ్యాంకులు కూడా పని చేయవు.. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు సైతం మూసి ఉంటాయని తెలుస్తోంది. అమెరికా, చైనా అధ్యక్షులు జో బైడెన్, జీ జిన్ పింగ్ సహా పలు దేశాధినేతలు ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి రానున్నారు. ఇంతటి బృహత్ కార్యక్రమం నిర్వహించడం మనకు గర్వ కారణమని మోడీ పేర్కొన్నారు.