టీడీపీ (TDP), జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ (YCP) కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బాబు సూపర్ 6 తోపాటు, ఇతర గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని తెలిపారు. గాజువాకలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేశ్ మాట్లాడుతూ… అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోవడమే జగన్ పని అంటూ మండిపడ్డారు. రేపో, మాపో గాలిపై కూడా పన్ను వేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.
వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనే అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిన ఘనత జగన్‌ది అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్రకు కనీసం ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కును సైతం అమ్మేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలను తీసేస్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
పూర్తి కథనం..