హైదరాబాద్(Hyderabad)లోని పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీటీమ్(She Team)దృష్టిపెట్టింది. నగరంలోని నెక్లెస్‌రోడ్, ఇందిరాపార్క్, కృష్ణ కాంత్ పార్క్‌తో పాటు ఇతర పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన జంటలను షీటీమ్ అదుపులోకి తీసుకుంది.
12 మందిని అదుపులోకి తీసుకొని జరిమానాతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి పంపింది. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నెక్లెస్‌రోడ్‌తో పాటు ఇతర పార్కుల్లో షీటీమ్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో కొన్ని జంటలు అభ్యంతరకర కార్యకలాపాలు సాగిస్తూ ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తున్నట్లు షీటీమ్‌కు పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వేర్వేరు ప్రాంతాల్లోని పార్కులతో పాటు ఇతర ప్రదేశాల్లో మఫ్టీలో రంగంలోకి దిగింది షీటీమ్.
అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి ముందు సాక్ష్యంగా వాళ్ల కార్యకలాపాలను వీడియో రికార్డింగ్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో 12మందికి రూ.50 రూపాయల చొప్పున జరిమానా విధించారు. హద్దులు మీరి ప్రవర్తించిన మరో ఇద్దరికి రూ.1250 చొప్పున జరిమానా విధించారు.