బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి సమ్మక్క సారలమ్మలనే మోసం చేశారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(CM KCR)పై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎక్కడా లేరంటూ జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కనీసం పార్లమెంట్‌లో ఎంపీగా కూడా లేరని గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడింది కేవలం కాంగ్రెస్ పార్టీనే అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీల పాత్ర కీలకమన్నారు. కేవలం తెలంగాణ క్రెడిట్‌ను కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. స్వరాష్ట్ర ఏర్పాటు నెరవేరాక బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆ పార్టీని స్థాపించలేదని, కేవలం వారి స్వలాభం కోసమేనని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు తేలిక అని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టే కుట్రలో బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఉందన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరులో మాట్లాడుతున్నారన్నారు.