ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తు రెండు పార్టీల్లో చిచ్చుపెడుతోందనే ప్రచారం జరుగుతోంది. కాగా టీడీపీ, జనసేన ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ పై చోటు దక్కని నేతలంతా గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తూ వస్తున్న సీనియర్లకు చంద్రబాబు మొదటి లిస్ట్ లో మొండి చేయి చూపించారు.
దీంతో సీనియర్లు రగిలిపోతున్నారు. తాము పార్టీని అట్టిపెట్టుకుని ఇన్నేళ్ల కాలం పాటు పని చేసినందుకు ఫలితం ఇదేనా అని నిలదీస్తున్నారు. మరోవైపు జనసేనకి ఫస్ట్ లిస్ట్ లో టీడీపీ 24 సీట్లు ఇవ్వడంతో పార్టీ నేతల్లో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. మొత్తానికి ఈ పొత్తుల సంసారంలోని సీట్ల పంపకం వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో అన్నమయ్య (Annamayya) జిల్లా, తంబాలపల్లి (Tambalapalli)లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో నిరసనకు దిగారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గొల్లశంకర్ యాదవ్ కి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అందులో వైసీపీ నుంచి వలస వచ్చిన దాసరి పల్లె జయచంద్రారెడ్డికి టికెట్ ఇస్తూ.. తంబాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి లోనైనా గొల్లశంకర్ అనుచరులు చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో గొల్లశంకర్ యాదవ్ (Golla shankar yadav) అనుచరులు మాట్లాడుతూ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తిని కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శంకర్ కి టికెట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహుతి చేసుకొంటామని హెచ్చరించారు. వాళ్ళతో తెచ్చుకొన్న పెట్రోల్ డబ్బా మూత తీసి ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించారు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు అడ్డుకొన్నారు.