75 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. అంతరిక్షం అయినా లేదా సాంకేతిక రంగం అయినా.. భారత్(Bharat) ప్రతీ రంగంలో ముందంజలోనే ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం నుంచి చంద్రయాన్ వరకు ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది ఇస్రో(ISRO).
క్రమంలో భారత్ అంతరిక్షంలో తొలి స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోనుంది. దీనికి సంబంధించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్(ISRO chief S Somnath) కీలక విషయాన్ని వెల్లడించారు. రానున్న కొన్నేళ్లలో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో స్టేషన్‌లోని మొదటి మాడ్యూల్స్‌ను ప్రయోగించే అవకాశం ఉందన్నారు.
స్పేస్ స్టేషన్ సంబంధించి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. 2035నాటికి భారత్‌కు చెందిన తొలి స్పేస్ స్టేషన్ అందుబాటులోకి రావాలని ప్రధాని మోడీ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు సోమనాథ్ తెలిపారు. ఈ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో 2-4 వ్యోమగాములకు వసతి కల్పిస్తుందన్నారు. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే అంతరిక్ష కేంద్రాలను కక్ష్యలోకి పంపినట్లు తెలిపారు.
స్పేస్‌లో స్వతంత్ర అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరించే అవకాశం ఉందని చెప్పారు. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. స్పేస్ స్టేషన్ నిర్మాణానికి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. భూమికి 400 కి.మీ.ల దూరంలోని కక్ష్యలో దీన్ని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
బరువైన రాకెట్, బాహుబలి లాంచ్ వెహికిల్‌ని ఉపయోగించాలని, దీనికి ప్రణాళిక రూపొందించామని చెప్పారు. దీని బరువు 20 టన్నులు ఉంటుందన్నారు. స్పేస్ విజన్ 2047లో భాగంగా ప్రధాని మోడీ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుతో పాటు 2040 నాటికి తొలి భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని శాస్త్రవేత్తలకు లక్ష్యాలను నిర్దేశించారు.