భారత షట్లర్ బీ సాయి ప్రణీత్ (Sai Praneeth) అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్(Retirement) ప్రకటించాడు. ఈ విషయాన్ని 31 ఏళ్ల ప్రణీత్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.
అమెరికాలో ఒక క్లబ్ సేవలు అందించబోతున్నట్లు తన ప్రణీత్ వివరించాడు. ‘డియర్ బ్యాడ్మింటన్ థాంక్యూ. బ్యాడ్మింటన్‌తో 24ఏళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలుకుతూ.. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుంచి కెరీర్లో కొత్త చాప్టర్ మొదలుపెడుతున్నా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటాను.’ అంటూ రాసుకొచ్చాడు.
అదేవిధంగా ‘అభిమానుల అపూర్వ మద్దతు నా గొప్ప బలం. భారత జెండా ఎగిరినప్పుడల్లా నా ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. నా ఫస్ట్ లవ్ బ్యాడ్మింటన్. ఈ ఆట ద్వారే నాకు గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, మరెన్నో అడ్డంకులను అధిగమించాను. అవి నా హృదయంలో పదిలంగా ఉంటాయి. నా తల్లిదండ్రులు, భార్య శ్వేత కెరీర్ ఉన్నతికి ఎంతగానో దోహదపడ్డారు. గోపీచంద్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు.’ అంటూ రాసుకొచ్చాడు.
ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించగా.. 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్నాడు. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంకు సాధించాడు. 2017లో సింగపూర్ ఓపెన్ గెలిచిన ఈ స్టార్ షట్లర్ 2019 ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10ర్యాంకింగ్స్ నిలువడంతో ప్రతిష్ఠాత్మక టోక్యో (2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది.