– మేడిగడ్డను పరిశీలించిన కేంద్ర కమిటీ
– దాదాపు 6 గంటల సేపు పరిశీలన
– 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పిల్లర్ల కుంగుబాటు..
– పగుళ్లను నిశితంగా గమనించిన సభ్యులు
– ర్యాఫ్ట్ దిగువున పూర్తిగా కొట్టుకుపోయిన ఇసుక
– ఖాళీ ఏర్పడడాన్ని గుర్తించిన నిపుణులు
– ఎల్ అండ్ టీ అత్యుత్సాహం
– మీడియా, పోలీసులకు నో ఎంట్రీ
– రేపు అన్నారం, సుందిళ్లలో కమిటీ పర్యటన
తెలంగాణలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలకు దిగింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు విమర్శలు వస్తున్న క్రమంలో.. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది. ఐదుగురితో కమిటీ ఏర్పాటు కాగా.. గురువారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు సభ్యులు.
మేడిగడ్డ విచ్చేసిన జాతీయ డ్యాం సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం బ్యారేజీని ఆసాంతం సందర్శించింది. మధ్యాహ్నం తరువాత అన్నారం బ్యారేజీ సందర్శించాల్సి ఉండగా, దానిని రేపటికి వాయిదా వేసి రోజంతా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపైనే దృష్టి సారించింది. దాదాపు 6 గంటల సేపు వీరి పరిశీలన సాగింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృతంలో ఐదుగురు సభ్యుల బృందం విస్తృత అధ్యయనం చేసింది.
బ్యారేజీ దిగువకు వెళ్లి, 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్ల కుంగుబాటుకు దారితీసిన కారణాలను సమగ్రంగా పరిశీలించింది. బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లను నిశితంగా గమనించింది. ర్యాఫ్ట్ దిగువున ఇసుక పూర్తిగా కొట్టుకుపోయి ఖాళీ ఏర్పడడాన్ని గమనించింది. బ్యారేజీ 6, 8 బ్లాకుల పియర్లలోనూ పగుళ్లు ఏమైనా ఉన్నాయా అని నిపుణుల బృందం పరిశీలించింది.
ఆనకట్ట సామర్ధ్యాన్ని పూర్తిగా విశ్లేషించి, ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. ఎన్డీఎస్ఏ బృందం పర్యటన సందర్భంగా ఎల్ అండ్ టీ సంస్ధ ప్రతినిధులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాను బ్యారేజీపైకి అనుమతించలేదు. ఎస్బీ, పోలీసులను సైతం బ్యారేజీపైకి రాకుండా కట్టడి చేశారు. రేపు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిపుణులు సందర్శించి, బ్యారేజీల్లో సీపేజీకి దారి తీసిన కారణాలపై పరిశీలించనున్నారు.