యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ( Sri Lakshmi Narasimha Swamy) వారిని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ఆయనకు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల తొలి రోజున సతీ సమేతంగా యాదాద్రీశుడికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
పూజల అనంతరం సీఎం దంపతులకు, ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందచేశారు. కాగా సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ ఉన్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 11 రోజులపాటు జరుగనున్నాయి.
మరోవైపు యాదగిరిగుట్ట పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగిందని ప్రచారం జరుగుతోంది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడానికంటే ముందు మిగతా వారు పీటలపై ఆసీనులయ్యారు. కానీ భట్టికి పీట లేకపోవడంతో కింద కూర్చున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి టూర్ లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో హాజరయ్యేందుకు తమ పేర్లు ఉన్న ఆలయం లోపలికి అనుమతించడం లేదని కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
సీఎం జిందాబాద్, పోలీస్ జూలూమ్ నశించాలని నినాదాలు చేశారు. దీంతో యాద్రాద్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతకుముందు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.