ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వ్యవహారంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)పై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్బీఐను ఆదేశించింది.
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని, ఆ సమాచారాన్ని మార్చి 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మార్చి 30వ వరకు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని ఆదేశించినా మళ్లీ అదనపు సమయం కోరడాన్ని కోర్టు తీవ్రమైన విషయంగా పరిగణించింది. 26 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఎస్బీఐని ప్రశ్నించింది.
ఎస్బీఐ ఆ సీల్డ్ కవర్ను తెరిచి, ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. మార్చి 15 సాయంత్రం 5గంటల కల్లా ఎస్బీఐ ఇచ్చిన వివరాలను బహిరంగపరచాలని ఎన్నికల సంఘాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు.