బీఆర్ఎస్ (BRS) లోపాలను బలమైన ఆయుధంగా మలచుకొన్న కాంగ్రెస్.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయాన్ని సాధించింది. అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసే పనిలో పడింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగం అయ్యిందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలు రావడంతో.. రేవంత్ రెడ్డి సైతం కారును స్క్రాప్ లోకి పంపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో భద్రాచలం (Bhadrachalam)లో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) నేడు ప్రారంభించిన సీఎం.. బడుగు వర్గాల ఆత్మ గౌరవమే ఇందిరమ్మ ఇళ్లని.. పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించారని అన్నారు.. భద్రాచలం స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని పథకం ప్రారంభించానని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ (KCR) పదేళ్లు మోసం చేశారని.. పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. కలల ప్రాజెక్ట్ అంటూ కొట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాళ్ళు ఉండవలసింది జైలులో అని విమర్శించారు..
మరోవైపు భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని.. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల బాధ చూసే కాంగ్రెస్ (Congress) ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇదిలా ఉండగా అంతకు ముందు సీఎం భద్రాచలం సీతారాముని ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ ఈవో, వేద పండితులు పూర్ణ కుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.