బీసీల హక్కుల సాధన కోసం నేడు ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా రౌండ్ టేబుల్ సమావేశాన్ని యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని చిన వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన సమావేశానికి ముఖ్య అతిథిగా భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హాజరైయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన డిమాండ్ కు చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చామన్నారు. కానీ దళితుడుకి వినతిపత్రం ఇచ్చారని నాడు రేవంత్ అవమానించారని ఆరోపించారు. అప్పుడు ఓపిక పట్టినామని.. కానీ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడు అయిన డిప్యూటీ సీఎం భట్టిని, బీసీ మంత్రి కొండా సురేఖను ఇవ్వాళ రేవంత్ (Revanth Reddy) అవమానించారని విమర్శించారు..
ఈ క్రమంలో భట్టికి, కొండ సురేఖకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా మహిళకు 47 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతోన్నట్లు ఆరోపించారు. గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ (KCR) జీవో ఇచ్చారని… దాన్ని కాంగ్రెస్ (Congress) వాళ్లు తీసేసారని కవిత విమర్శించారు.. సీఎం చెప్పేవన్ని అబద్ధాలే అని ఆరోపించిన ఆమె యువతను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ విమర్శించారు..
విద్యార్థులను మోసం చేయవద్దని.. బీసీలకు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత పేర్కొన్నారు.. అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో యూపీఏ ఆధ్వర్యంలో చేపట్టిన కుల గణనను తొక్కి పెట్టారని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కులగణన లెక్కలతో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపిన కవిత.. తాము జైమ్ భీం, జై బీసీ, జై పూలే నినాదంతో ముందుకు వెళ్తామని తెలిపారు..