భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ పరికరాలతో రాజస్థాన్‌లోని పోఖ్రాన్ (Pokhran) ఫైరింగ్ రేంజ్లో “భారత్ శక్తి” (Bharat Shakti) పేరుతో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), 30 దేశాల ప్రతినిధులు ఈ సైనిక విన్యాసాలను తిలకించారు. 50 నిమిషాల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శన దేశీయ తయారీ ఆయుధాల పనితీరును మరోసారి ఘనంగా చాటింది.
ఆయుధాల తయారీ అగ్రదేశాలకే పరిమితం అనే అపోహలను చెరిపేస్తూ దేశీయంగా ఆధునిక ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసిన భారత్- అవి సామర్థ్యంలోనూ అత్యుత్తమమని చాటి చెబుతోంది.. దేశీయ తయారీ తేజస్ యుద్ధవిమానాలు.. శత్రు శిబిరాలు, బంకర్లు ధ్వంసం చేసే ప్రదర్శన ఔరా అనిపించింది. గ్రాడ్ బీఎం 21 రాకెట్ లాంఛర్లు, ధనుష్ గన్ వ్యవస్థ, షారంగ్ గన్ సిస్టమ్ శత్రువులపై ఎలా విరుచుకుపడతాయనేది ఇందులో ప్రదర్శించారు.
ఈ సైనిక విన్యాసాలలో K9 వజ్రా యుద్ధ ట్యాంకు శత్రు బంకర్లను తుత్తునియలు చేసిన తీరు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. శత్రుమూకల పీచమణిచేందుకు డ్రోన్లను ఎలా వాడతారో సైన్యం కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉభయచర BMP-2 వాహనాలు దుమ్మురేపుకుంటూ యుద్ధ క్షేత్రంలో ఎలా దూసుకుపోతాయో ఈ విన్యాసంలో చూపించారు.
మాడ్యులర్ వంతెన, పదిమీటర్ల షార్ట్ స్పాన్ వంతెనలు ఎలా ఉపయోగపడతాయో ప్రదర్శించారు. అర్జున యుద్ధ ట్యాంకుల పని తీరు ఆకట్టుకొంది. వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ LH మార్క్-4 చేసిన ఫైరింగ్ అబ్బురపరిచింది. వాయుసేనకు చెందిన షిక్రా మానవ రహిత విమానాన్ని దేశీయ తయారీ BLT-72 ట్యాంకులు క్షణాల్లోనే ధ్వంసం చేశాయి. బ్రిడ్జి లేయింగ్ ట్యాంకులతో గగనతల లక్ష్యాలను కూల్చివేసే ప్రక్రియను ప్రదర్శించారు.
యుద్ధ క్షేత్రంలో మాటువేసిన శత్రు ట్యాంకులను ధ్వంసం చేసే ప్రక్రియను కళ్లకు కట్టినట్లు చూపించారు.. శత్రువులు పంపే డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేసే నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ సత్తా చాటింది. డ్రోన్‌ను ధ్వంసం చేసింది. మరోవైపు ఆధునిక తుపాకులు, రాకెట్ లాంచర్లతో శత్రువును వేగంగా మట్టికరిపించే విన్యాసాలను నిర్వహించారు. త్రివిధ దళాలు శత్రువును క్షణాల్లోనే ఏమార్చి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించే ప్రక్రియ ఆకట్టుకొంది.
క్విక్ రియాక్షన్ ఫోర్స్ వెహికల్, ఇన్ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్, లైట్ బులెట్ ప్రూఫ్ వాహనాల సాయంతో యుద్ధక్షేత్రంలో సైనికులు ఎలా శత్రువులతో యుద్ధం చేస్తారో సైనికులు ప్రదర్శించారు.