పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(Ex Minister, Medchal MLA Mallareddy), ఆయన తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు.
వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Karnataka Deputy CM DK Shivakumar)ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది.
ఇప్పటికే ఈనెల 4న మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు రాష్ట్ర మంత్రివర్గంలోని ఓ కీలక మంత్రిని రహస్యంగా కలిసినట్లు సమాచారం. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని కోరినట్లు వార్తలు వచ్చాయి. సీఎంను ఎలాగైనా ఒప్పించాలని, లేదంటే ఢిల్లీ స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు తెలిసింది.
ఈనెల 6న ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ నిరసన చేపట్టగా మల్లారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొనలేదు. అప్పటి నుంచి బీఆర్ఎస్ను వీడనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రి మల్లారెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపి కలిసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.