కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎన్నికల కమిషనర్లను నియమించింది. గత నెల ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే (Anoop Chandra Pandey) పదవీ విరమణ చేయగా ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ (Arun Goel) అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈసీ నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే ఎంపిక కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ (Congress) నేత అధిర్ రంజన్ ఛౌదరీ ఈ పేర్లను బయటపెట్టారు. ఇదిలా ఉండగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లతో నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం జాబితాను రూపొందించింది.
అనంతరం మోడీ (Modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమై ఈ అంశంపై చర్చించింది. ఇందులో అధీర్‌తో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అధిర్ రంజన్ ఛౌదరి ఎంపిక కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉందని తెలిపారు. మొదట తనకు 212 పేర్లను పంపించారని తెలిపిన కాంగ్రెస్ నేత.. సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారన్నారు.
చివరకు మాజీ బ్యూరోక్రాట్లు పంజాబ్‌కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధు, కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపికచేసినట్లు తెలిపారు. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ (EC)ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)ని మినహాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం 15న విచారణ జరపనుంది.