టీడీపీ(TDP) నుంచి టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేతలు ఆందోళనలు చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు లేకపోతే బతకలేమా..? అంటూ ప్రశ్నించారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కొన్ని సీట్లను టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు టీడీపీ నేతలు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో బుద్దా వెంకన్న శనివారం మీడియా సమావేశంలో టీడీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబుకు, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని ఇదివరకే ఆయన హెచ్చరించారు. పొత్తు వల్ల సీటు కోల్పోయిన వాళ్ల ఆందోళన సరికాదని హితవుపలికారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని బెదిరించడం సరికాదన్నారు.
కార్యకర్తలు.. పార్టీ కోసం, చంద్రబాబు కోసం పని చేస్తారని, నేతల కోసం కార్యకర్తలు పని చేయరని స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రంలో తన కన్నా ఫైటర్ ఎవరున్నారంటూ బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు. ఐవీఆర్ఎస్ పెడితే తానే మొదటి స్థానంలో ఉంటానంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకున్నాడంటూ ఎద్దేవా చేశారు.
నాని వెనుక పది మంది కూడా లేరన్నారని, క్యాష్ కోసం క్యారెక్టర్ అమ్ముకున్న వ్యక్తి కేశినేని నాని అంటూ విమర్శించారు. బెజవాడ ఎంపీ స్థానాన్ని లక్ష ఓట్లతో టీడీపీ గెలుస్తుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కేశినేని నానిదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నాని ఓటమి ఖాయమని, ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యమని జోస్యం చెప్పారు.