ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టైన విషయం తెలిసిందే. నేటి ఉదయం ఢిల్లీ (Delhi)లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ (CBI) ప్రత్యేక కోర్టులో కవితను (MLC Kavitha) హాజరుపరిచారు. అయితే ఈ సమయంలో కవిత అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది? విచారిస్తారా? లేక కోర్టులో ప్రవేశపెడతారా? జైలుకు పంపిస్తారా వంటి అనేక ప్రశ్నలు పలువురిలో ఉదయిస్తున్నాయి.
మరోవైపు కవితను PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు చేరుకొన్నారు. అయితే.. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
ఇక కవిత అరెస్ట్‌తో ఢిల్లీ ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసు బలగాల మోహరించారు. మరోవైపు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సుప్రీం కోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. ఈడీ కోర్టులో రిమాండ్‌ను చాలెంజ్ చేయనున్నారు. చట్ట విరుద్దంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు తెలుపుతామన్నారు. న్యాయవ్యాదులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలుపనున్నారు.
అదేవిధంగా కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఉల్లంఘించిందని తెలిపారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని పేర్కొన్నారు. 15 సెప్టెంబర్ 2023లో ఈడీ తరపున సమన్లు ఇవ్వమని అన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా కవితను అరెస్టు చేయబోమని సెప్టెంబర్15న చెప్పారని వెల్లడించారు.
సెప్టెంబరు 26న మరోసారి వాదనలు జరిగాయని అన్నారు. ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకొన్నారని కోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో ఒక అప్లికేషన్ వేస్తామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా కవితతో ఐదు నిముషాలు మాట్లాడేందుకు ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి అనుమతి కోరారు. ఆయన విజ్ఞప్తిని న్యాయమూర్తి నాగపాల్ అనుమతి ఇచ్చారు. కాగా ఈడీ తరఫున ఎన్.కె మట్టా, జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపించనున్నారు.