దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule)ను ఈసీ తాజాగా ప్రకటించింది. ఈమేరకు ఢిల్లీ (Delhi) విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar) ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని ప్రకటించారు.
తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ఉంటుందని.. రెండో దశ ఏప్రిల్ 26న, మూడో దశ మే7వ తేదీన, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ ప్రకటించింది. ఈ క్రమంలో నేటి నుంచి జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు.
అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం లోక్‌సభకు ఏపీ (AP), తెలంగాణ (Telangana)లో మే 13 వ తేదీన నాలుగో దశలో పోలింగ్ జరగనుందన్నారు.. అలాగే.. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక (By-Election) కూడా ఇదే తేదీన జరగనుందని, జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నట్లు తెలిపారు..
ఈ సందర్భంగా మాట్లాడిన రాజీవ్ కుమార్.. గతంలో కంటే ఎన్నికల వ్యవస్థ మరింత మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకొన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించి.. దేశవ్యాప్తంగా పర్యటించి ఎస్పీలు, కలెక్టర్లతో చర్చించామని వివరించారు. ఇలాంటి పలు పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఎన్నికల తేదీలు నిర్ణయించినట్లు వెల్లడించారు. దేశ పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు..