దేశంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 (IPL-2024) సెకెండ్ ఫేజ్‌ను దుబాయ్(UAE)లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అలాంటి వార్తలపై బీసీసీఐ(BCCI) ఫుల్ స్టాప్ పెట్టింది.
దేశవాప్తంగా ఎన్నికలు జరగనున్నప్పటికీ ఐపీఎల్-17వ సీజన్ ఎక్కడికీ తరలిపోదని వెల్లడించింది. ఐపీఎల్ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జైషా(BCCI Secretary Jaisha) స్పష్టం చేశారు. శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జై షా స్పందించారు.
‘ఐపీఎల్-2024 ఎక్కడికీ పోదు. విదేశాలకు తరలించే ఆలోచన లేదు. టోర్నీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుంది. మిగతా ఐపీఎల్ షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని జై షా పేర్కొన్నారు. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను షెడ్యూల్ చేసిన అనంతరం బీసీసీఐ విడుదల చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ బట్టి బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. మరో వారంలో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.