ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వ్యవహారంలో సుప్రీకోర్టు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)పై సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎస్బీఏ సెలెక్టివ్‌గా ఉండకూడదని, మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది. బాండ్ల నంబర్లతో సహా ఎలక్టోరల్ బాండ్లపై సమాచారన్నంతా అడిగినట్లు గుర్తుచేసింది.
గడువులోగా వివరాలు ఇవ్వలేదని ఇప్పటికే సుప్రీకోర్టు ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్బీఐ అప్రమత్తమై ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ఎలక్టోరల్ బాండ్స్ సంఖ్యని కూడా వెల్లడించాలని తేల్చి చెప్పింది. దీంతో రెండో విడత ఎలక్టోరల్ బాండ్లపై మరింత డేటాను ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. ఈ డేటాను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
అయినప్పటికీ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని మరోసారి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వివరాలను బహిర్గతం చేయడంలో ఎస్బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేసింది. మార్చి 21 సాయంత్రం 5 గంటలలోపు అన్ని వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అయితే ఎంపిక ధోరణి వద్దని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై తదుపరి ఉత్తర్వుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. మార్చి 21 సాయంత్రం 5 గంటలలోపు అన్ని వివరాలను వెల్లడించిందని చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ చైర్మన్‌ను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఇవ్వాల్సి ఉంటే, అవి కూడా ఇస్తామని ఎస్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తెలిపారు.