రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్(Congress Government) ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA)లకు సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister Mallareddy) వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
ఆయన నేతృత్వంలోని మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. తమకు పురుగుల ఆహారం అందిస్తున్నారంటూ విద్యార్థినులు క్యాంపస్ ఎదుట నిరసన తెలిపారు. ఆహార భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థినులు మండిపడటంతో స్వయంగా ఆయనే కలగ చేసుకున్నారు.
హాస్టల్కు వచ్చి అక్కడ భోజనం చేశారు. ఇలాంటివి పునరావృతం కావని చెప్పారు. అయితే ఈ వివాదం అంతటితో సద్దుమణగలేదు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 60మంది విద్యార్థులను డిటైన్ చేసింది యాజమాన్యం. దీంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. అకారణంగా డిటైన్ చేశారంటూ ఆరోపించారు.