పార్లమెంట్ ఎన్నికలు(parliment Elections) సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ (PM MODI) దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్కరోజే రెండు నుంచి మూడు రాష్ట్రాలు తిరుగుతూ నాన్ స్టాప్‌గా ప్రచారం చేస్తున్నారు. ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్ కీ బార్ 400 పార్’ అంటూ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో రెండు రోజులు పర్యటించిన ప్రధాని.. మల్కాజిగిరి రోడ్ షోలో పాల్గొని ఎంపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆ తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల సభలో పాల్గొన్నారు.
నేడు ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు(Tamilanadu) పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ నిర్వహించిన ఓ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై, I.N.D.I.A కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి నేతలు హిందుత్వాన్ని (Hindutwa)అవమానించడంలో ముందుంటారని, అందుకు ఒక్క సెకను కూడా వృథా చేయరని మోడీ ఆరోపించారు.
డీఎంకే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇతర విశ్వాసాలను టార్గెట్ చేయవని, కేవలం హిందువులను మాత్రమే అవమానిస్తాయని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. హిందుత్వంలో శక్తి అంటే మాతృశక్తి అని ఆయన వివరించారు. ఇటీవల రాహుల్ గాంధీ ముంబైలో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా ‘శక్తి’ ని అడ్డుకోవడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. నారీ శక్తి, శివశక్తి గురించి మాట్లాడేవారికి ఓటర్లు బుద్దిచెబుతారని మోడీ వ్యాఖ్యానించారు.
ఇదిలాఉంటే గతంలోనూ రాహుల్ హిందుత్వాన్ని, హిందుత్వవాదులను బయటకు పంపించాలని మాట్లాడిన మాటలు పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. ఇక తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో హిందుత్వంపై మాట్లాడేవారికి వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున బుద్ది చెప్పాలని మోడీ పిలుపునిచ్చారు.