మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసే వారు పుట్టుకొస్తారు.. ఇది నగ్న సత్యం అయినా మనిషి ఆశ ఈ నిజాన్ని నమ్మదు అని ఎన్నో సార్లు నిరూపించబడింది. తాజాగా మనుషులలో ఉన్న ఆశను భారీగా క్యాష్ చేసుకొన్న ఘరానా మోసాగాడి లీలలు నగరంలో వెలుగులోకి వచ్చాయి.. హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్ (Uppal)లో రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం పేరుతో ఒకటి కాదు రెండు ఏకంగా రూ.500 కోట్లతో ఉండాయించిన ఘటన సంచలనంగా మారింది.
JV బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించిన వ్యక్తి ఇందులో పెట్టుబడులు పెడితే డబుల్ మని వస్తాయని నమ్మించి జనానికి టోకరా ఇచ్చారు.. కోట్లాది రూపాయలను దండుకోని పరార్ అయ్యారని బాధితులు లబోదిబో మంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు.. దాదాపు 500 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసి సుమారు 7 వేల మంది కొనుగోలుదారులను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు..
భూముల కొనుగోలుకు పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభం చూపి భారీ మోసానికి పాల్పడినట్లు వెల్లడిస్తున్నారు. ఇందులో లక్ష నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారని బాధితులు పేర్కొంటున్నారు. అయితే నిందితుడు కొన్ని నెలలు డబ్బులు బాగానే ఇచ్చారని, కానీ గత నాలుగు నెలల నుంచి వడ్డీ ఇవ్వడం లేదు, అసలు ఇవ్వడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు.
తీరా ఆఫీస్ కి వస్తే.. తాళం వేశారని వాపోయారని వెల్లడించారు. అధిక వడ్డీ వస్తుందని అత్యాశకు పోయి డబ్బులు పెట్టడం మాదే తప్పు అని ఈ సందర్భంగా బాధితులు వాపోయారు. లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు మోసం చేసినట్లు బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉప్పల్ పోలీస్టేషన్ లో బాధితుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు..