గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆలయాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నేడు రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు, సినీమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. అనంతరం నల్లగొండ (Nalgonda) జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు..
రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని తెలిపిన వెంకట్ రెడ్డి.. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. రైస్ మిల్లర్స్ ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని తెలిపిన మంత్రి.. రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వం తప్పక చర్యలు చేపడుతుందని అన్నారు..
ఇదిలా ఉండగా వెంకట్ రెడ్డికి నల్లగొండలో చేదు అనుభవం ఎదురైంది. ఎంఐఎం, ముస్లిం నేతలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAAపై కాంగ్రెస్ (Congress) వైఖరి ఏంటో స్పష్టం చేయాలని నిలదీశారు. కదలకుండా అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో మంత్రి, ఎంఐఎం నేతపై సీరియస్ అయ్యారు. దీంతో ముస్లిం నేతలు.. కోమటిరెడ్డి డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకుని.. వారిని స్టేషన్ కు తరలించారు.
మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వడగళ్లు, గాలులతో కూడిన వర్షానికి చేతి కొచ్చిన పంటలు నేలరాలాయి. అదేవిధంగా సిరికొండ మండలం, లఖంపూర్ గ్రామంలో పంట గాలికి నేలరాలింది. రాంపూర్ గ్రామంలో జొన్న, మొక్క జొన్న, గోధుమ, పంటలు గాలికి నేలకొరిగాయి. కొమురం భీం జిల్లా బెజ్జూర్ లో భారీ వర్షంతో కల్లాల్లోని మిర్చిపంట తడిసిపోయింది.