ఇటీవల జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల(EC) నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. ఇప్పుడు నిలిపివేస్తే తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తుతుందని పేర్కొంది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇటీవలే కొత్తగా ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ నియామకాలనూ ధర్మాసనం ప్రస్తావించింది.
వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పకూడదని కోర్టు వెల్లడించింది. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేమన్న ధర్మాసనం ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమతుల్యత పాటించాల్సిన అవసరముందని తెలిపారు.
అదేవిధంగా 2023లో రాజ్యాంగ ధర్మాసం ఇచ్చిన తీర్పులో ఈసీ నియామకం కోసం సెలక్షన్ కమిటీలో న్యాయవ్యవస్థ సభ్యుడు ఉండాలని ఎక్కడా చెప్పలేదని సుప్రీం పేర్కొంది. 2023 చట్టం రూపొందించక ముందు ఎన్నికల కమిషనర్ల నియామక తాత్కాలిక కమిటీలో ప్రధాని, సీజేఐ, లోక్సభలో విపక్షనేత సభ్యులుగా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఏర్పడిన కమిటీలో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రికి చోటు కల్పించారు. దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.