గులాబీ అధినేత దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు(parliament Elections) సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. కానీ, కేసీఆర్(KCR) మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతున్నారు.
తను అనుకున్న అభ్యర్థులను ఎంపిక చేసినా ఆ స్థానాల్లో వారు సత్తా చాటుతారా? అన్న భయం కేసీఆకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది గులాబీ నేతలు పోటీకి దూరంగా ఉన్నారు. కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇస్తానని చెప్పినా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎంత బలమైన క్యాండిడేట్ అయినా ఓడిపోతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మదిలో ఉన్న అభ్యర్థులు ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారా? లేదా అన్నది పక్కన బెడితే బీజేపీ, కాంగ్రెస్కు కనీసం పోటీ ఇస్తారా? అనేది ఇక్కడ చిక్కు ప్రశ్నగా మారింది. ముఖ్యంగా ఆరు ఎంపీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక గులాబీ బాస్ కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
అందులో నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, మెదక్, హైదరాబాద్ స్థానాలు ఉన్నాయి. నాగర్ కర్నూలో ఆర్ఎస్పీ, సికింద్రాబాద్ నుంచి పద్మారావుగౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్ నుంచి కమలాకర్, నల్లగొండలో కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.కాగా,వీరి విజయావకాశాలపై మరోసారి పరిశీలించాకే పేర్లను అధికారికంగా ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది.
ఇదిలాఉంటే, ఎంపీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఉద్యమకారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మొదటినుంచి కేసీఆర్ తమను చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు.