మద్యం ప్రియుల(Alcohol lovers)కు హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) బ్యాడ్ న్యూస్ చెప్పారు. హోలీ పండుగ(Holi festival) రోజున వైన్ షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లను మూసివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది.
హోలీ సందర్భంగా ఈ నెల 25వ తేదీ(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు బంద్ చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు ఆయా పోలీసు కమిషనరేట్ల కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ హోలీ పండుగ సందర్భంగా మద్యం షాపుల బంక్‌తో పాటు పోలీసులు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు కూడా చేశారు. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఇతరులపై బలవంతంగా రంగులు వేయకూడదని, ఇబ్బంది పెట్టకూడదన్నారు. రోడ్లపై బైక్‌లు నడుపుతూ అరాచకాలు సృష్టించవద్దని హెచ్చరించారు.
పండుగల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగంగా తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సమయంలో స్నేహితులు, బంధువులందరూ మద్యం సేవించి గొడవలు, వివాదాలకు దారి తీయకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.