ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయమై ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత బంధువులపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే హైదరాబాద్‌లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు అఖిల(Akhila) నివాసంలో ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
శనివారం తెల్లవారుజాము నుంచే మాదాపూర్‌లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. గత శుక్రవారం(మార్చి 15న) లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలిచారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పది రోజుల కస్టడీ విధించింది. మరోవైపు, ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.