‘ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఓడించే బాధ్యత నాది.. అందుకు ఎంత దూరమైనా వెళ్తా..’ అని ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌కు, పవన్ కల్యాణ్‌కు చాలా తేడా ఉందన్నారు. జగన్ పిలిస్తేనే వైసీపీలో చేరానని స్పష్టం చేశారు.
ఆయన ఇంకా 30ఏళ్లు సీఎంగానే ఉంటారని తెలిపారు. 20సీట్ల కోసం తాను పవన్‌కు ఎందుకు సపోర్ట్ చేయాలన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే కాకుండా ఎవరు పడితే వారు పార్టీ పెడితే నేను వెళ్లాలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు పవన్ ఏ మడుగులో ఉన్నాడని ఎద్దేవా చేశారు. తాను వైసీపీలో చేరకుండా ఉండుంటే పవన్ కల్యాణ్‌పై పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేవాడినని తెలిపారు.
వారసత్వ రాజకీయాలు ఒకరి సొత్తు కాదని, తన కొడుకు రాజకీయాల్లోకి ఎందుకు రావొద్దని ప్రశ్నించారు. పత్తిపాడు నుంచి కాపుల కోసం పని చేయడంతోనే తన రాజకీయ పతనం ప్రారంభమైందని వెల్లడించారు. ఉద్యమం వల్ల తాను నష్టపోయానంటూ ముద్రగడ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు తనను చాలా ఇబ్బందులకు గురిచేశాడని, పవన్ కళ్యాణ్ కాపుల కోసం ఇప్పుడు ఉద్యమం చేయొచ్చు కదా అంటూ ముద్రగడ సలహా ఇచ్చారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారు అని, వాళ్లది ‘మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు’ అనే పద్ధతి ఉంటుందని ముద్రగడ విమర్శించారు. పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడు అని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.