ఇటీవలి కాలంలో సైబర్ కేటుగాళ్ల (Cyber Crimes) వలలో చిక్కుకుని చాలా మంది డబ్బు(Money)ను పొగొట్టుకుంటున్నారు. రాను రాను ఇటువంటి కేసులు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు గుర్తుతెలియని లింక్స్ మీద క్లిక్ చేసి లేదా నకిలీ పార్శిల్ల పేరుతో మేము పోలీసులం అంటూ కాల్ చేసి సైబర్ మోసగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఈ మోసగాళ్లు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలీదు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూర్చుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
అయితే,ఈ కేటుగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయిన వారిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, మిడిల్ క్లాస్ వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, లాయర్లు, డాక్టర్లు ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్టే ఉంటుంది. మనిషిలోని డబ్బు ఆశను వీరు క్యాష్ చేసుకుంటున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రోజుల్లో చాలా మంది మహిళలు, కాలేజీ విద్యార్థినీ, విద్యార్థలు పార్ట్ టైం జాబ్స్ కోసం సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు.
ఈ విషయాన్ని ముందుగా పసిగడుతున్న సైబర్ నేరగాళ్లు సంబంధిత వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు లేదా నార్మల్ టెస్ట్ రూపంలో వారికి లింకులు పంపిస్తున్నారు. చిన్న చిన్న టాస్కులు చేస్తే వేల రూపాయలు సంపాదించుకోవచ్చని నమ్మిస్తున్నారు. ముందుగా రూ.వందల్లో వారికి లాభం చూపించి ఆ తర్వాత వేల నుంచి లక్షలు, మరికొన్ని సందర్భాల్లో కోట్లు కొల్లగొడుతున్నారు.ఇటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ (RTC MD Sajjannar) ఎక్స్X(ట్విట్టర్) వేదికగా స్పందించారు.
మాదకద్రవ్యాల పార్శిల్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.మత్తుపదార్థాలు మీ పేరిట వచ్చాయని, కస్టమ్స్ ఆఫీసర్స్ పట్టుకున్నారని వీడియాకాల్స్,ఐవీఆర్ కాల్స్, నార్మల్ కాల్స్ వచ్చినా పట్టించుకోవద్దన్నారు. ఒకవేళ ఇలాంటి ఉదంతంలో ఎవరైనా మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు.