ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంక అంత కదులుతోంది. ఒక్కొక్కటిగా గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో జరిగిన అవినీతి(Curruption) అక్రమాలకు పోలీసు అధికారులు ఎలా కోపరేట్ చేశారు. అందులో ఎవరెవరు ఎంతెంత లాభపడ్డారు. ఎవరెవరికి ఈ కేసుతో లింకులు ఉన్నాయి. ప్రస్తుతం వారంతా ఎక్కడ ఉన్నారు. ఏ పోస్టింగుల్లో ఉన్నారు? వారికి ఎవరి అండదండలు ఉన్నాయి? ఇలా ప్రతి ఒక్క అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సీరియస్గా ఫోకస్ పెట్టింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు(Former DSP Praneeth Rao) ఇప్పటికే కస్టడీ ఉన్న విషయం తెలిసిందే. విచారణలో ఆయన చెప్పిన కీలకమైన సమాచారం ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో మరింత ముందుకు వెళ్తున్నది.ఈ క్రమంలోనే గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సాయం చేసిన తిరుపతన్న, భుజంగరావులను అరెస్టు చేశారు.
దీనంతటికీ కీలక సూత్రధారి అయిన ప్రభాకర్ రావు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిద్ధం అవుతోంది. అయితే, ప్రణీత్ రావు కేసులో భాగంగా గతంలో మొయినాబాద్ ఫాంహౌస్ యవ్వారం కూడా తాజాగా బయటకొచ్చింది. ఫాంహోస్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి కూడా ఈ వ్యవహారం లింక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదంతా అప్పుడు ఓ మంత్రి కనుసన్నల్లో జరిగిందని తేలింది.
ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన తిరుపతన్న, భుజంగరావులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు విచారణలో తేలింది.ప్రముఖ జ్యువెల్లరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను సైతం వీరు ట్యాపింగ్ చేసినట్లు విచారణలో గుర్తించారు. హవాలా రూపంలో డబ్బులు మార్చే వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఎవరెవరు వీరికి బాధితులుగా ఉన్నారో వారి వివరాలను సైతం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లను కూడా వీరు ట్యాప్ చేసినట్లు తేలింది.