రంగుల పండుగ హోలీ కొందరి జీవితాల్లో చీకటిని నింపింది. ఆనందంగా రంగులు పూసుకొని చివరికి అందని లోకాలకు వెళ్ళేలా చేసింది. వారి కుటుంబం లో తీవ్ర విషాదం నెలకొనేలా చేసింది.. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో చోటు చేసుకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. హోలీ ఆడిన అనంతరం స్నానం కోసమని కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మరణించారు.
ఈ క్రమంలో నలుగురు యువకులు నదిలో గల్లంతు అయ్యారు.. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి (Dandepalli) మండలం తానిమడుగు వద్ద లిఫ్టు ఇరిగేషన్ కాల్వలో స్నానానికి వెళ్ళిన మరో యువకుడు గల్లంతు అయ్యాడు.. మృతుడు జన్నారం మండలం, ధర్మారం గ్రామానికి చెందిన కార్తిక్ గా గుర్తించారు.
మరోవైపు కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం ఈతకు వెళ్ళిన విద్యార్థి నీట మునిగి మృత్యువాత పడ్డాడు.. బండ్లగూడ, అహ్మద్ గూడ చెరువులో సరదాగా ఈతకు వెళ్ళిన విద్యార్థి నరేష్(12) ఈత రాక మునిగి మరణించాడు.. ఇతను రాంపల్లి, శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడని సమాచారం.. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా హోలీ వేడుకల్లో పలుచోట్ల విషాదాలు నెలకొన్నాయి..
హోలీ వేడుకలకు వెళుతున్న భార్యభర్తలు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకోచోట వాటర్ ట్యాంక్ పగలి యువతి పై పడటంతో ఆమే అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తానికి ఆనందంగా జరుపుకోవలసిన హోలీ పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.