పాకిస్తాన్(Pakistan)లోని నౌకాదళ ఎయిర్ స్టేషన్(Naval Air Station)పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army) దాడికి పాల్పడింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఎయిర్ స్టేషన్ పాక్‌లోని రెండవ అతి పెద్దది.
పాక్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలను మొత్తం ఇక్కడ నిల్వ చేస్తారు. అయితే, నిన్న (సోమవారం) రాత్రి దాడి ప్రారంభం అయినప్పటి నుంచి ఇంకా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని బలుచీస్థాన్ పోస్ట్ చేసింది. అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు వెల్లడించాయి.
ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు. బలూచిస్థాన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. బీఎల్ఎ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పీఎన్ఎస్ సిద్ధిఖీ నేవల్ బేస్‌లోకి ప్రవేశించి అక్కడ పలు చోట్ల పేలుళ్లకు దిగినట్లు తెలిపింది. నేవీ బేస్ దగ్గర అర్ధరాత్రి షెల్లింగ్ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలిపింది.
అయితే, టర్బాట్‌లోని అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. డాక్టర్లను అప్రమత్తం చేశారు. ఇక, దీనికి ముందు జనవరి 29వ తేదీన గ్వాదర్‌లోని పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పైనా దాడి జరిగింది. ఇక, తాజాగా టర్బాట్లో సోమవారం రాత్రి ప్రారంభమైన దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ భద్రతా ఏజెన్సీ వర్గాలు చెప్పాయి.