గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చామని చెప్తున్న సీఎం జగన్(CM Jagan) తాను అడిగే 7ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(TDP Chief Chandrababu Nayudu) సవాల్ విసిరారు. ‘ప్రజాగళం'(Prajagalam) యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా(Ananthapuram District) రాప్తాడు(Rapthadu)లో గురువారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
ఈసారి 52చోట్లా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు సూచించారు. అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాల్సిన అవసరముందన్నారు. సామాన్యులు జీవించలేని విధంగా ఒకవైపు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు, మద్యం ధరలను అమాంతం పెంచేశారని అన్నారు.
మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనన్న జగన్ నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఆఖరికి ఇసుక పైనా దోపిడీ చేసి భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారని దుయ్యబట్టారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నిలువునా రంగం కుదేలైందని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని, విధ్వంసకర రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ప్రత్యేకహోదా, సీపీఎస్ రద్దు, మద్య నిషేధం, ఏటా జాబ్ కరెంటు ఛార్జీల తగ్గింపు, క్యాలెండర్, మెగా డీఎస్సీ, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
రాయలసీమను తాము హార్టికల్చర్ హబ్‌గా చేస్తే.. జగన్ మాత్రం రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. తన చర్యలతో సీఎం జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశాడంటూ ధ్వజమెత్తారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దన్నారు. గత ఏపీ ఎన్నికల్లో రాయలసీమలోని 52సీట్లలో 49 చోట్ల వైసీపీని గెలిపిస్తే ఏం ఒకగబెట్టలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.