లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం రాజకీయం ఆర్థికరంగం చుట్టూ తిరుగుతోంది. తమ హయాంలో దేశ ఆర్థికరంగం దూసుకుపోయిందని బీజేపీ ప్రచారం చేసుకుంటుంటే అదంతా బూటకమంటూ కాంగ్రెస్ కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం(Chidambaram) కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ పెట్టుబడిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం తగ్గిపోయిందన్నారు.
2023-24 సంవత్సరంలో భారత ఆర్థికరంగం గొప్పగా ఉందన్న ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) వ్యాఖ్యలను ఆయన ఎక్స్(X) వేదికగా ఆయన ఖండించారు. విదేశీ పెట్టుబడుల్లో 31 శాతం కోత పడ్డ విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ పాలసీలపై తగ్గుతున్న నమ్మకానికి ఇది కొలమానమని వ్యాఖ్యానించారు. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటోందని చిదంబరం విమర్శించారు. గుడ్ సర్టిఫికేట్ అనేది విదేశీ అండ్ భారతీయ పెట్టుబడిదారుల నుంచి రావాలంటూ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ.. ‘భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. 2023-2024లో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెబుతోంది.. అదే నిజమైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎందుకు తగ్గిపోతున్నాయి..? దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారు’’ అని ప్రశ్నించారు.
మూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంపైన పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారని, వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి.. నిజమైన వేతనాలు ఆగిపోయాయని వెల్లడించారు. అదేవిధంగా రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని, గృహ వినియోగం తగ్గిపోతుందని పేర్కొన్నారు.ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితమైన సంకేతాలు.. కానీ ఇవన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం పునరుద్ఘాటించారు.