బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahil Gandhi) ఎక్స్(x) వేదికగా మహిళలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.
సురక్షితమైన ఆదాయం, సురక్షితమైన భవిష్యత్తు, స్థిరత్వం, ఆత్మగౌరవం ఉన్న మహిళలు నిజంగా సమాజానికి శక్తిగా మారతారని వ్యాఖ్యానించారు. నేటికీ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు మాత్రమే ఎందుకు ఉద్యోగం చేస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో మహిళల జనాభా 50శాతం ఉంటే 10 ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క మహిళ మాత్రమే ఎందుకు ఉన్నారని నిలదీశారు.
అదేవిధంగా ఉన్నత విద్యలోనూ మహిళలదే పైచేయి అని గుర్తుచేశారు. అయితే, దేశంలో మహిళలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. జనాభాలో సగభాగమున్న మహిళలకు పూర్తి హక్కులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని రాహుల్ తెలిపారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలను మహిళలకే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించామన్నారు.
పార్లమెంట్, అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దేశ విధిని మార్చగల సామర్థ్యం మహిళలకు ఉందని రాహుల్ పునరుద్ఘాటించారు. పేద కుటుంబాల్లో మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు బదిలీ చేస్తామన్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేస్తామని తెలిపారు. ‘సావిత్రిబాయి ఫూలే హాస్టళ్ల’ను కూడా ఏర్పాటు చేస్తామని రాహుల్ తెలిపారు.