రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress)లోకి వలసలు పెరుగుతున్న క్రమంలో.. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంటుంది. జాబితాలో కీలక మార్పులు జరగబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి (Peddapally)ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని మాల, మాదిగ ఈక్వేషన్తో మార్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు రాజకీయ వర్గాల టాక్.. ఇప్పటికే లోక్ సభ అభ్యర్థుల విషయంలో ప్రయార్టీ ఇవ్వకపోవడంపై మాదిగ సామాజిక వర్గం మండిపడుతోంది.
మరోవైపు రాష్ట్రంలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ స్థానాల్లో రెండు చోట్ల మాలలకే అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో 80 లక్షల జనాభా కలిగిన తమకు అన్యాయం జరుగుతుందని మాదిగలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా కడియం శ్రీహరి (Kadiam Srihari) ఎంట్రీ, కీలక మార్పునకు దారి తీస్తుందని భావిస్తున్నారు.. ఈయన చేరికతో ఒక్కసీటైనా దక్కుతుందా? అనే అనుమానం మాదిగలో మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది.
అలాగే పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఖాయం అనే చర్చ ప్రస్తుతం తెరపైకి వస్తోంది. ఇప్పటికే గడ్డం కుటుంబం నుంచి చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉన్న విషయం తెలిసిందే.. తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్ సైతం అదే కుటుంబానికి కేటాయించడం కాంగ్రెస్ లో రచ్చ రచ్చగా మారింది. అలాగే సెగ్మెంట్ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యేలు వంశీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ఢిల్లీ (Delhi) పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమ వర్గానికి అవకాశం కల్పించాలని పిడమర్తి రవి, గజ్జెల కాంతం, సంపత్ తదితర మాదిగ సామాజిక నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్ఆర్ఐని బరిలోకి దింపాలని ఏఐసీసీ (AICC) రంగం సిద్ధం చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
ఇక కడియం ఎంపీ టికెట్ హామీ మేరకే కాంగ్రెస్లో చేరుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇదే జరిగితే రాష్ట్రంలో నాగర్కర్నూల్ మల్లురవి, పెద్దపల్లి గడ్డం వంశీ, వరంగల్ కడియం కుటంబంతో కలిపి మొత్తం మూడు మాల సామాజిక వర్గాలకే టికెట్లు దక్కినట్లు అవుతుంది. దీంతో మాదిగల నుంచి ఊహించని వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు హస్తం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.