హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalaxmi) కాంగ్రెస్ పార్టీలో (Congress Joining)చేరారు. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నివాసంలో పీసీసీ చీఫ్ ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ కే కేశవరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేకే, ఆమె కూతురు విజయలక్ష్మి ఇద్దరు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
రెండు రోజుల కిందట కేకే,ఆమె కూతురు పార్టీ మారుతున్నట్లు ప్రకటించగా.. శనివారం ఉదయం సీఎం సమక్షంలో మేయర్ విజయలక్ష్మి హస్తం పార్టీలో చేరారు. ఆమె తండ్రి కే కేశవరావు కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. పార్టీలో ఆయనకు లభించే స్థానం గురించి ఇంకా క్లారిటీ రాకపోవడం వల్లే ఆయన చేరిక ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. దానిపై సీఎం రేవంత్ నుంచి క్లారిటీ రాగానే అధికారికంగా ఆయన చేరనున్నారు.
ఇదిలాఉండగా, కేకే కొడుకు మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించాడు. కూతురి బలవంతం వల్లే కేకే పార్టీ మారడానికి సిద్ధపడ్డారని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇదిలాఉండగా, ఇప్పటికే హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తాజాగా మేయర్ విజయలక్ష్మి చేరికతో మరికొందరు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌లో తమకు విలువ లేదని, వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇస్తానని హస్తం పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీనిస్తే పార్టీ మారేందుకు సిద్ధమంటూ 10 మంది కార్పొరేటర్లు పేర్కొనట్లు తెలుస్తోంది.