మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) 36 గంటల రైతు భరోసా దీక్ష(Rythu Bharosa Deeksha) చేపట్టారు. పెద్దపల్లి జిల్లా(Peddapally District)లోని బీఆర్‌ఎస్ భవన్‌లో శనివారం దీక్షను ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 8గంటల వరకు కొనసాగనుంది. ఇటీవల మంథని, ఓదెల, సుల్తానాబాద్, ధర్మారం, ముత్తారం, కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి మండలాల్లో దెబ్బతిన్న పొలాలను కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పరిశీలించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 36గంటల దీక్ష చేపట్టి ఆయన రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. పంటలు ఎండుతున్నా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా కొప్పుల డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసే వరకూ తన పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉన్న పరిస్థితులే మళ్లీ వచ్చాయన్నారు. కేసీఆర్ రైతుల అభివృద్ధికి ఎంతో చేశారని గుర్తుచేశారు. ఆయన హయాంలో వ్యవసాయం పండుగలా మారిందని అభివర్ణించారు.
పుష్కలమైన నీళ్లు, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో సంబురంగా సాగిందని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ వంద రోజుల పాలనలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని దుయ్యబట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. మన్మందు పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దీక్షలో కొప్పుల వెంట పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్‌ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఉన్నారు.