ఎన్నికల కోడ్(Election Code) కారణంగా వలంటీర్లతో పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Nayudu) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary of Govt) డాక్టర్ కేఎస్ జవహార్ రెడ్డి(Dr KS Jawahar Reddy) కి లేఖ రాశారు.
ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా సోమవారం(ఏప్రిల్ 1) లబ్ధిదారులకు పింఛన్లు అందేలా చూడాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు తన లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేయలేదనే వార్తలు వస్తున్నాయని అలా జరగకుండా చూడాలని కోరారు. అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసేలా చూడాలని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛన్ మొత్తం చెల్లించాలన్నారు.
అదేవిధంగా గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ జరగాలన్నారు. దీనికోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు విన్నవించారు.
గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5 తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా లేఖ రాసిన చంద్రబాబు రాష్ట్రంలో పెన్షన్ ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరారు.