తెలంగాణలో ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) కొత్త పంథాతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం ఎందుకో సైలంట్ అయ్యింది. దీంతో ప్రతిపక్షాలు ఇదే అదునుగా భావించి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాయి.అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీకి 12 ఎంపీ స్థానాలు వస్తాయని సమాచారం. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 14 స్థానాలు సాధించాలని పార్టీ నేతలకు టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో అన్నదాతల(FORMERS STRUGGLES) రోడ్డెక్కుతున్నారు. భూగర్భజలాలు ఎండిపోవడం, సాగుకు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.దీంతో రాబోయే ఎన్నికల్లో అన్నదాతల సమస్యలను ప్రధాన అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్,బీజేపీ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి.
ఇప్పటికే కేసీఆర్(KCR) ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం పర్యటించి అన్నదాతల సమస్యలపై ఫోకస్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా హయాంలో పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలాంటి స్థితికి తెలంగాణ వచ్చిందని సెంటిమెంట్ రగిలించే ప్రయత్నంచేశారు.దీనికి తోడు ఈనెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతుల సమస్యలపై కేసీఆర్ ప్రధానంగా ఫోకస్ చేసి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో కనీసం రెండు ఎంపీ స్థానాల్లో అయినా కారు పార్టీ గెలవకపోతే ఆ పార్టీకి జనంలో మైలేజ్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పార్టీని సీనియర్లు వీడుతుండటంతో గులాబీ కేడర్ తీవ్ర నైరాశ్యంలో ఉన్నది. పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి, కారు పార్టీకి జనాల్లో ఆదరణ తగ్గలేదని ప్రూవ్ చేయడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ (BANDI SANJAY) కూడా రైతు సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. రైతు దీక్ష పేరిట కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ జిల్లాలో అడుగుపెట్టే కంటే ముందే దీక్ష చేయాలని బండి భావించారు. ఎప్పటికైనా రైతుల తరఫున కోట్లాడేది బీజేపీ మాత్రమే అని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదని అన్నదాతలకు భరోసా కల్పించేందుకు బండి సిద్ధమయ్యారు.
గత ప్రభుత్వం చేసిన తప్పుల వెలికితీత,ఎంపీ టికెట్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ బిజీగా ఉన్న టైంలోనే ప్రజల ఫోకస్‌ను తమవైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.నిజంగా అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరాల్సిందే అని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.