ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ హస్తిన రాజకీయాలను గందర గోళంలో పడేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పాలనపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తన పదవికి రాజీనామా చేస్తారా? అలా అయితే తదుపరి సీఎం ఎవరు అనే ఉత్కంఠ నెలకొందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీఎం రేసులో సునీతా కేజ్రీవాల్ (Sunitha Kejriwal) పేరు సైతం తెరమీదికి వస్తుంది.

గతంలో లాలూ ప్రసాద్ యాదవ్కు అవినీతి కేసులో జైలు శిక్ష విధించడం వల్ల ఆయన భార్య సీఎంగా పగ్గాలు చేపట్టారు. అలాగే సునీతా కేజ్రీవాల్ కూడా చేపడతారని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇక అర్హతల విషయానికి వస్తే.. ఆమె ఐఆర్ఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ఉన్నత చదువులు చదివారు, ప్రస్తుతం ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉంది. ఎన్నికల ప్రచారల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు..
ప్రస్తుతం కేజ్రీవాల్ తర్వాత ముఖ్య నేతలుగా ఉన్న మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా జైలులో ఉన్నారు. దీంతో తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు సునీతకి ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా 55 మంది ఆప్ ఎమ్మెల్యేలు నేడు సునీత కేజ్రీవాల్ ని కలిశారు. రెండు కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రికి అండగా ఉన్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయవద్దని తెలియచేయమని సూచించినట్లు తెలుస్తోంది.