రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకి కేంద్ర ఎన్నికల సంఘం (CEC) షాక్ ఇచ్చింది. ఐదుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉన్న సమయంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.. వారి స్థానంలో కొత్త వారి నియామకం కోసం ప్యానెల్ పంపించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh)లో సార్వత్రిక ఎన్నికల వేళ సీఈసీ నిర్ణయం చర్చాంశనీయంగా మారింది. వీరిని వెంటనే బదిలీ చేయాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు ఈసీ లేఖ పంపింది.. ఈ లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి కూడా పంపించింది.. మార్చి 17న చిలకలూరిపేట ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు సీఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా బదిలీ వేటు వేసినట్లు సమాచారం.
అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఓ పార్టీ కార్యకర్త హత్య జరిగింది.. ఈ క్రమంలో ఈసీ మీనా ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డిని పిలిచి వివరణ కోరారు.. ఆ తర్వాత సీఈసీకి నివేదిక పంపించారు..ఈ కారణంగానే ఆయనపై బదిలీ వేటు పడినట్లు టాక్.. అదే విధంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికొందరిని బదిలీ చేసినట్లు సమాచారం.
ఇక కలెక్టర్ల విషయంలో కూడా ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి (Tirupati)లో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి ఫిర్యాదు చేసినా కలెక్టర్ లక్ష్మీషా పట్టించుకోలేదని అందిన ఫిర్యాదుతో విచారణ జరిపిన అనంతరంఆమెపై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒకేసారి ఇంతమంది అధికారులను బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది..