వారసత్వ, అవినీతికి గ్యారెంటీ కాంగ్రెస్(Congress) పార్టీ అని బీజేపీ(BJP) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు ప్రత్యేకత ఉందన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత ప్రజలు విజ్ఞతతో తీర్పు ఇస్తూ వస్తున్నారని తెలిపారు. వచ్చే 18వ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు ఇప్పటికే తీర్మానించుకున్నారని అన్నారు. మోడీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ అధికారాన్ని అడ్డుకోవాలని కొన్ని వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
సుస్థిర నాయకుడు, మచ్చ లేని నాయకుడు, అవినీతి లేని నాయకుడు మోడీ అని వ్యాఖ్యానించారు. మోడినే దేశానికి అతిపెద్ద గ్యారెంటీ అని అభివర్ణించారు. అముల్ బెబీగా పిలువబడుతున్న రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇవ్వడానికి తుక్కుగూడకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అమూల్ బేబీగా చిలిపి చేష్టలు చేస్తున్న ఆయన దేశానికి ఎలా గ్యారంటీ అవుతారని ప్రశ్నించారు.
తుక్కుగూడకు రాహుల్ గాంధీ గ్యారంటీ ఇవ్వడం కాదు.. తెలంగాణలో కాంగ్రెస్‌ను తుక్కు తుక్కుగా ఓడిస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ దేనికి గ్యారెంటీ అని ప్రశ్నించారు. దేశ విచ్ఛిన్నం కోరుకునే శక్తులకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అని ధ్వజమెత్తారు. సంక్షేమం, మెకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాకు మోడీ గ్యారెంటీ గా ఉన్నారని తెలిపారు. 370 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని చర్చ జరుగుతోందని తెలిపారు.